RR: ‘నేను సైతం 2.0’ కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని నాగోలు పోలీసుల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 74 సీసీ కెమెరాలను సోమవారం ప్రారంభించారు. కృష్ణానగర్‌లోని పల్లవి డీబీఆర్ అపార్ట్‌మెంట్స్, రాఘవేంద్ర కాలనీ, తట్టి అన్నారం పరిధిలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయం, అన్నవరపు సత్యనారాయణ కాలనీల్లో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను గుర్తించేందుకు కెమెరాలు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, నివాస కాలనీల్లో భద్రతను పెంచేందుకు ఈ చర్య చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజలకు మరింత భద్రత కల్పించడంతో పాటు నేరాలు జరిగినప్పుడు దర్యాప్తులో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, నాగోలు పోలీసులు, స్థానిక ప్రజలు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
