హైదరాబాద్: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా హస్మత్‌పేట్, అల్వాల్ ప్రాంతాల్లో నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లను మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ప్రత్యక్షంగా పరిశీలించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆమె క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఊరేగింపు మార్గంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందితో సీపీ మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, ఊరేగింపు సజావుగా సాగేందుకు చేపట్టిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే విధుల్లో ఉన్న అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు బందోబస్తును పటిష్ఠంగా కొనసాగించారు. మతపరమైన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు.
