హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి శ్వేత ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేరాల నివారణే లక్ష్యంగా హనుమకొండ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
హనుమకొండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, బ్లూ కోల్ట్స్ సిబ్బందితో కలిసి రెడ్డి కాలనీలోని పలు ఇళ్లను సందర్శించి మహిళలకు, స్థానికులకు సైబర్ నేరాలు, డ్రగ్స్, ఆస్తి నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో మోసం చేస్తున్నారని, గుర్తుతెలియని కాల్స్, మెసేజ్ లు, లింకులు, నకిలీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వవద్దని, మోసపోతే వెంటనే 1930 నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
యువత డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లల స్నేహితులు, అలవాట్లు, కదలికలను గమనిస్తూ వారికి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని కోరారు.
ఇళ్ల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు తిరిగినా, తాళం వేసిన ఇళ్లపై ఎవరైనా నిఘా పెట్టినట్లు అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నివారణ సాధ్యమని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ బ్లూ కోల్ట్స్ సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
