సైబరాబాద్, ఆగస్టు 31: సైబరాబాద్ పో0లీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీస్ అధికారులకు సోమవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ సీపీ కార్యాలయ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సీపీ డాక్టర్ ఎం. రమేష్ వారిని సన్మానించి, వారి సేవలను అభినందించారు.
పదవీ విరమణ పొందిన వారిలో కేపీహెచ్‌బీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం. రవీందర్ రెడ్డి, ఎస్బీ సైబరాబాద్ ఎస్ఐ పి. విజయ్ భాస్కర్ రెడ్డి, సైబరాబాద్ CAR హెడ్‌క్వార్టర్స్ RSI ఫరీద్ ఖాన్, అత్తాపూర్ ఏఎస్ఐ టి. కేశవులు, బాలానగర్ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ఏబీ శర్మ ఉన్నారు.
ఈ సందర్భంగా సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ.. పదవీ విరమణ కొత్త జీవిత అధ్యాయానికి నాంది అని అన్నారు. పోలీస్ శాఖలో వారు అందించిన సేవలు, అనుభవం ఎంతో విలువైనవని పేర్కొన్నారు. విధి నిర్వహణలో కుటుంబ సభ్యుల సహకారం కీలకమని తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతూ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని సూచించారు. అవసరమైన సందర్భాల్లో తమ అనుభవం, సూచనలతో పోలీస్ శాఖకు సహకరించాలని పదవీ విరమణ పొందిన అధికారులను కోరారు. అనంతరం వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని సీపీ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, ఎస్బీ డీసీపీ సుధీంద్ర, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, అదనపు డీసీపీ షమీర్తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
