వరంగల్: వరంగల్‌ను నేరరహిత నగరంగా, డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేతా ఐపీఎస్ తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత ఆధ్వర్యంలో సీపీ స్వయంగా ఆటోనగర్, కరీమాబాద్, కాశిబుగ్గ, శంభునిపేట, శివనగర్, ఎల్.బి. నగర్ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుకు తీవ్ర ముప్పు అని, డ్రగ్స్ సరఫరా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధితులకు కౌన్సెలింగ్, చికిత్స అందించి సన్మార్గంలోకి తీసుకొస్తామన్నారు.
ఈ తనిఖీల్లో రౌడీషీటర్లు, పాత నేరస్థులు, డ్రగ్స్ కేసుల్లో ప్రమేయం ఉన్నవారితో కలిపి 107 మందిని అదుపులోకి తీసుకొని డ్రగ్స్ పరీక్షలు చేయగా 29 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 17 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 3 ఎలక్ట్రిక్ మోటార్ పంపులను స్వాధీనం చేసుకున్నామని, మిల్స్ కాలనీ పీఎస్‌లో PITA యాక్ట్ కింద ఒక కేసు నమోదు చేశామని తెలిపారు.
కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మాట్లాడి నేరాలపై సమాచారం సేకరించామని, నేరాల నియంత్రణకు ప్రతి కాలనీలో కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఇలాంటి ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని, డ్రగ్స్ సమాచారం తెలిస్తే డయల్ 100/112కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ ఇంచార్జ్ ఏసీపీ నరసింహారావు, మట్టేవాడ, ఇంతేజార్ గంజ్, మిల్స్ కాలనీ, మడికొండ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
