వనస్థలిపురం: మహిళల భద్రతకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారనే భరోసా కల్పిస్తూ రాఖీ పౌర్ణమి సందర్భంగా వనస్థలిపురం పోలీసులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ‘సహచరి’ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులతో కలిసి పోలీసు అధికారులు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలకు పోలీసులు రాఖీలు కట్టి, వారి భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందనే సందేశాన్ని అందించారు. మహిళలు ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు. మహిళల రక్షణ, భద్రత కోసం పోలీసు శాఖ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. మహిళలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువస్తే తక్షణమే స్పందించి అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో వనస్థలిపురం ఎస్‌హెచ్‌ఓ రవి బాబు, ఎస్‌ఐలు నాగరాజు, మల్లయ్య, గిరిష్, గౌతమ్, అనిల్, ఇతర పోలీసు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మహిళలు, పోలీసుల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ‘సహచరి’ కార్యక్రమం ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
