మల్కాజిగిరి: రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. రహదారులపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులకు రాఖీలు కట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలని పోలీసులు అవగాహన కల్పించారు.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, లేన్ క్రమశిక్షణ పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టడం ద్వారా పోలీసులు, ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
మన కుటుంబ సభ్యుల భద్రత కోసం బాధ్యతాయుతంగా వాహనాలు నడపడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి, ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమానికి వాహనదారులు, ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
