హైదరాబాద్: నగరంలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును బేగంపేట్ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి చోరీకి గురైన 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బేగంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ద్విచక్ర వాహన చోరీ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో బైక్‌లను చోరీ చేస్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు సమాచారం.
చోరీ చేసిన వాహనాలను గుర్తింపును మార్చి, ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడి సమాచారం ఆధారంగా బేగంపేట్, మియాపూర్, వరంగల్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో చోరీకి గురైన 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
చోరీలకు సంబంధించి మరికొందరి ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను వాటి అసలు యజమానులకు అప్పగించే చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాలను భద్రంగా పార్క్ చేసి తప్పనిసరిగా తాళం వేయాలని సూచించారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
