మహబూబ్‌నగర్: నూతనంగా ఏర్పాటైన మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీ ఏర్పాటైన విషయాన్ని ఎస్పీకి తెలియజేసి, అసోసియేషన్ కార్యకలాపాలపై వివరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్యారసాని సురేష్ మాట్లాడుతూ పోలీసు అధికారులు, సిబ్బంది మధ్య అసోసియేషన్ అనుసంధానకర్తగా పనిచేస్తుందని తెలిపారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పోలీసు శాఖ అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం కోసం కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.
నూతన కమిటీ సభ్యులకు ఎస్పీ డి. జానకి అభినందనలు తెలిపారు. సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారం, శాఖలో సమన్వయం పెంపొందించేలా అసోసియేషన్ నిర్మాణాత్మకంగా పనిచేయాలని సూచించారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, బాధ్యతాయుత విధులు, పరస్పర సహకారం, టీమ్ స్పిరిట్ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది మధ్య పరస్పర గౌరవం, సమన్వయం మరింత బలోపేతం కావాలని, శాఖ ప్రతిష్టను పెంచేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. నూతన కమిటీకి తన పూర్తి సహకారం ఉంటుందని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
