ఎల్‌బీనగర్: నాగోల్ పోలీస్ స్టేషన్‌ను ఎల్‌బీనగర్ డీసీపీ బి. అనూరాధ, IPS మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరు, రికార్డుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల వివరాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు అందుతున్న సేవలు, ఫిర్యాదుల పరిష్కారంలో తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్ సిబ్బందితో డీసీపీ సమావేశమై విధి నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, విధుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, పోలీస్ స్టేషన్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ప్రజలకు పోలీస్ శాఖపై మరింత నమ్మకం కలిగేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని డీసీపీ సూచించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి, నిబంధనల ప్రకారం పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత, రికార్డుల నిర్వహణలో క్రమబద్ధత పాటించాలని సూచించారు. సిబ్బంది సంక్షేమంతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని డీసీపీ బి. అనూరాధ మార్గనిర్దేశం చేశారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
