హైదరాబాద్: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేలా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఐపీఎస్ స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం నగరంలోని ప్రధాన శోభాయాత్ర మార్గాలను బైక్‌పై తిరుగుతూ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
మొజంజాహీ మార్కెట్ (ఎంజే మార్కెట్), బషీర్‌బాగ్, లిబర్టీతో పాటు శోభాయాత్ర సాగే కీలక ప్రాంతాలను సీపీ పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శోభాయాత్ర మార్గంలో ఎక్కడా నిలిచిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
విధుల్లో ఉన్న అన్ని విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సీపీ సజ్జనార్ సూచించారు. శోభాయాత్ర సజావుగా పూర్తయ్యేలా పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
