కుషాయిగూడ: సైబర్ జాగృతి దివస్, ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమాల్లో భాగంగా కుశాయిగూడ సర్కిల్‌లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీపీ సైబర్ క్రైమ్ శ్రీమతి ఎస్.వి. నాగలక్ష్మి, ఏసీపీ సైబర్ క్రైమ్‌తో కలిసి కుశాయిగూడ పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో అధికారులు నేరుగా మాట్లాడి, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ఆన్‌లైన్ లావాదేవీలు, సోషల్ మీడియా వినియోగం, అనుమానాస్పద లింకులు, నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని పంచుకోవద్దని తెలిపారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసపూరిత పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నందున, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన డిజిటల్ విధానాలను అలవర్చుకోవాలని అధికారులు సూచించారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా, తెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. ముఖ్యంగా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. సకాలంలో సమాచారం అందించడం ద్వారా మోసపోయిన నగదును తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
