అనకాపల్లి (ఎ.కోడూరు), ఆగస్టు 22: కె.కోటపాడు మండలం, ఎ.కోడూరు గ్రామంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర’ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అత్యంత శోభాయమానంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది.
హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి గారికి జిల్లా యంత్రాంగం మరియు పోలీసు శాఖ తరపున ఘన స్వాగతం లభించింది.
విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ మరియు అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలసి, సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు:
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ పర్యటనను అత్యంత క్రమశిక్షణతో, విజయవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ—
“ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేందుకు అంకితభావంతో పనిచేసిన ప్రతీ పోలీసు అధికారికి, సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు. మీ సమన్వయం, అప్రమత్తత, వృత్తిపరమైన క్రమశిక్షణ అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ నిబద్ధతకు నిదర్శనం. విశేషంగా ఇతర జిల్లాల నుండి విధులకు హాజరై విశేష సేవలందించిన అధికారులకు, సిబ్బందికి నా ప్రత్యేక ధన్యవాదాలు.”
