వరంగల్: హన్మకొండ కేయూ (KU) పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపం చెంది, ఎవరికీ చెప్పకుండా శుక్రవారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో, ఆందోళన చెందిన అతని భార్య ‘డయల్ 112’ అత్యవసర సేవ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కేయూ పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మరియు సబ్-ఇన్స్పెక్టర్ శ్రావణి.. బ్లూ కోల్ట్స్ సిబ్బంది వీరస్వామి, తరుణ్ కుమార్లను అప్రమత్తం చేశారు. సదరు వ్యక్తి మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా, బ్లూ కోల్ట్స్ సిబ్బంది అతడిని చింతగట్టు గ్రామం శివారులోని రైల్వే పట్టాల వద్ద గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వారు, రైల్వే పట్టాలపై ఉన్న ఆ వ్యక్తిని అత్యంత అప్రమత్తతతో కాపాడారు. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించగా, వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక విలువైన ప్రాణాన్ని కాపాడిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది వీరస్వామి మరియు తరుణ్ కుమార్లను పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (IPS) అభినందించి, వారికి నగదు బహుమతిని అందజేశారు. ప్రజల ప్రాణాలకు, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, అంకితభావంతో మరియు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత, అదనపు డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, కేయూ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
