వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 26 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ టి. సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి వాహనానికి చట్టబద్ధమైన నంబర్ ప్లేట్ తప్పనిసరి అని, నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం మోటారు వాహన చట్టానికి విరుద్ధమని అన్నారు. ఇలాంటి వాహనాలు ప్రమాదాలు లేదా నేరాలకు పాల్పడినప్పుడు గుర్తించడం కష్టమవుతుందన్నారు.
వాహనదారులందరూ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లు అమర్చుకుని ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ తనిఖీల్లో ట్రాఫిక్ సీఐలు ప్రవీణ్ కుమార్, వెంకన్న, సుజాత తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
