వరంగల్: ఆన్‌లైన్ మోసాలకు బలికావడం ద్వారా యువత తమ విలువైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత (ఐపీఎస్) హెచ్చరించారు. జాతీయ సైబర్ భద్రతా అవగాహన మాసం (NCSAM) సందర్భంగా భీమారంలోని ఎస్వీఎస్ కళాశాల ఆడిటోరియంలో వివిధ కళాశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం యువత భావోద్వేగాలను ఆసరాగా చేసుకుంటున్నారని సీపీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం చేసి, వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకోవడం ద్వారా యువత బ్లాక్‌మెయిల్‌కు గురవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మంచి చెడుల మధ్య తేడాను గుర్తించి, బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని, తమ సంస్కృతి, విలువలను నిలబెట్టుకోవాలని ఆమె యువతకు సూచించారు. అంతేకాకుండా, దసరా సెలవులను సద్వినియోగం చేసుకొని, తమ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని ఆమె విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధారా కవిత, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, ఇన్‌స్పెక్టర్లు రవికుమార్, అశోక్, ఎస్ఐ శివకుమార్‌తో పాటు ఎస్‌వీఎస్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
