వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర రావు గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఏసీపీ టి. సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది గురువారం వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ సర్కిల్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
వాహనాలకు కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసి అమర్చిన, అధిక శబ్దాన్ని వెలువరించే సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తనిఖీల సందర్భంగా తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా స్వాధీనం చేసుకున్న సుమారు 350 మార్పు చేసిన సైలెన్సర్లను రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు మాట్లాడుతూ, సైలెన్సర్లను మార్పు చేసి అధిక శబ్దం వచ్చే విధంగా వినియోగించడం వల్ల శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
వాహనదారులు తమ వాహనాల్లో కంపెనీ అమర్చిన ఒరిజినల్ సైలెన్సర్లనే ఉపయోగించాలని, నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్చి అధిక శబ్దం వచ్చేలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ టి. సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు సుజాత మరియు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Our Telangana Citizen Reporter

Mr. Siliveru Murali Krishna
