మల్కాజిగిరి: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులు అందుబాటులో ఉండాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ స్పష్టం చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వివిధ సమస్యలపై వచ్చిన పిటిషనర్లతో సీపీ సుమతి నేరుగా మాట్లాడి, వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల నుంచి సమస్యలకు సంబంధించిన వివరాలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ప్రజలు తమ సమస్యలను పోలీసు శాఖ దృష్టికి తీసుకువచ్చినప్పుడు వాటిపై నిర్లక్ష్యం లేకుండా సత్వరమే స్పందించాలని సంబంధిత అధికారులను సీపీ ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఫిర్యాదుదారుల సమస్యలకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపడంతో పాటు, తీసుకున్న చర్యలపై వారికి సమాచారం అందించాలని స్పష్టం చేశారు.
ప్రజలకు న్యాయం అందించడంలో పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరగకుండా పర్యవేక్షించాలని సీపీ సుమతి సూచించారు. పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం మరింత పెరిగేలా పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలందించాలని అధికారులను ఆదేశించారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
