హైదరాబాద్, ఆగస్టు 31: రానున్న గణేష్ చతుర్థి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అడిషనల్ సీపీ (లా అండ్ ఆర్డర్), జాయింట్ సీపీ సౌత్ రేంజ్ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ సోమవారం రాజేంద్రనగర్ ఏసీపీ డివిజన్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు విచారణలో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గణేష్ ఉత్సవాల బందోబస్తుకు అవసరమైన సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో తక్షణమే విజిలెన్స్, భద్రతా కమిటీలను ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర పౌర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ విగ్రహ ప్రతిష్ఠాపన, ఊరేగింపులు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి భద్రతా నిబంధనలు, శాంతిభద్రతల అంశాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీ ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్, అత్తాపూర్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
