వనస్థలిపురం: మహిళలు, బాలికల భద్రతతో పాటు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ షాపింగ్ మాల్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ సిబ్బంది పలు కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, మహిళలు, చిన్నారులపై జరిగే వేధింపులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా చిన్నారులు ఎదుర్కొనే పరిస్థితుల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య తేడాను గుర్తించి, అనుమానాస్పద పరిణామాలను తల్లిదండ్రులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, లోన్ యాప్‌ల ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీ, పాస్‌వర్డ్‌లను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. మహిళల భద్రతకు ఉపయోగపడే టీ-సేఫ్ యాప్ గురించి వివరించి, అవసరమైన సమయంలో దాని సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. షాపింగ్ మాల్‌లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యల ప్రాధాన్యతను కూడా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని షీ టీమ్స్ సిబ్బంది సూచించారు.
Our Citizen Reporter – Telangana
B. Bharath Reddy
