హైదరాబాద్, అత్తాపూర్ పోలీసుల చొరవతో సుమారు రూ.2 లక్షల విలువైన 25 పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ఫోన్లను ట్రేస్ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు బాధితులు, ఫోన్ యజమానులను పిలిపించి వివరాలను ధ్రువీకరించిన తర్వాత ఎస్‌హెచ్‌ఓ ఏ. సీతయ్య స్వయంగా మొబైల్ ఫోన్లను వారి యజమానులకు అందజేశారు. తమ ఫోన్లను తిరిగి పొందడంతో యజమానులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ ఏ. సీతయ్య మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా వెంటనే CEIR పోర్టల్‌లో IMEI నంబర్‌ను బ్లాక్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సమీప పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడంతో పాటు, పోలీసులు పరికరాన్ని త్వరగా గుర్తించి రికవరీ చేయడానికి సహాయపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (DI) రాజు నాయక్, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.
