మల్కాజ్‌గిరి: రానున్న గణేష్ ఉత్సవం–2026ను పురస్కరించుకుని మల్కాజ్‌గిరిలో సమన్వయ సమావేశం నిర్వహించారు. మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్, ట్రాఫిక్–1 డీసీపీ కె. రాహుల్ రెడ్డి ఐపీఎస్, లా అండ్ ఆర్డర్ డీసీపీ శ్రీధర్ సమావేశానికి హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు పాల్గొన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు చర్చించారు. ప్రధానంగా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు, భక్తుల రద్దీ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు, భద్రతా చర్యలు, బందోబస్తు తదితర అంశాలపై సమీక్షించారు. గణేష్ విగ్రహాల ఊరేగింపులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పోలీసు, మున్సిపల్, ఇతర ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సమావేశంలో స్పష్టం చేశారు.
