ఖమ్మం జిల్లా: అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను కాదని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తరుణంలో గాలివాటంగా పరిచయమైన వ్యక్తిని నమ్మి తన జీవితాన్ని అర్పించుకున్నది… ఏ విద్యార్హత ఆర్థిక స్తోమత లేకున్నా తన మనసుకు నచ్చిన వాడిని మతాచారం అడ్డొచ్చినా రక్త బంధాన్ని తెంచుకొని మరీ నమ్మించిన వాడిని మనవాడి జీవనం సాగిస్తోంది… సుఖ సంతోషాలతో కొనసాగిన జీవితాన్ని వదిలి కష్టాలు నష్టాలు పడుతూ దాంపత్య జీవనాన్ని కొనసాగిస్తూ ఈ బంధంతో పుట్టిన ఇరువురు బిడ్డలను సాకుతూ తన గుండె అంతరాల్లో కొనసాగుతున్న బడబాగ్నిని సైతం లెక్కచేయకుండా జీవనం సాగిస్తున్న సౌమ్యురాలు ఈమె… భర్త వ్యవహారం అతని చర్యలు తరచూ బాధించినా తాను మారుతాడు అన్న నమ్మకం జీవనాన్ని సాగిస్తూ వస్తుంది… ఆయన నమ్మకం మరో మారు వమ్మైంది … చివరకు భర్త చేసిన నేరం పై విచారణకు పిలవడంతో ఆత్మాభిమానం కలిగిన ఈబిడ్డ తనువు చాలించేందుకు సిద్ధమై తన కడుపున పుట్టిన బిడ్డలను కడతేర్చి తాను తనుపు చాలించింది… ఈ హృదయ విదారకమైన సంఘటన మండల పరిధిలోని నిదానపురం గ్రామంలో గురువారం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి..మండల పరిధిలోని నిదానపురం గ్రామానికి చెందిన షేక్ జానీ తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన షేక్ ప్రేజా(28)(మారిన పేరు) ఐదేళ్ల క్రితం మతాంతర ప్రేమ వివాహాన్ని చేసుకుంది. హైదరాబాదులో ఉన్నత చదువులు చదువుతున్న సమయంలో గాలివాటంగా పరిచయమైన బాజీ చెప్పిన మాయమాటలను నమ్మి హిందూ సంప్రదాయంతో విద్యావంతుల కుటుంబానికి చెందిన మృతురాలు దాంపత్య జీవితాన్ని గడిపేందుకు సిద్ధమై తన రక్త సంబంధాన్ని కనిపెంచిన తల్లిదండ్రులను విడిచి వచ్చేసింది. ప్రేమ మోజులో మృతురాలని తీసుకువచ్చిన భర్త బాజీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలోనే తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రేజా కూడా గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లేదని తెలిసింది. ప్రస్తుతం బాజీ ఖమ్మంలో ఓ ప్రైవేటు మోటారు ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిసింది. కాగా బాజీ ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికపరమైన నేర ప్రవృత్తిలో తప్పటడుగులు వేశాడు. వీటన్నింటినీ భరించుకుంటూ వచ్చిన మృతురాలు ఇటీవల జరిగిన ఓ కేసుకు సంబంధించి గురువారం ఉదయం ఖమ్మం చెందిన పోలీసులు విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చి బాజీని వెంట తీసుకొని వెళ్లారు. భర్త తల్లిదండ్రులు తమకున్న రెండు ఎకరాల పొలంలో పనులు చేసుకునేందుకు వెళ్లగా, పోలీసులు వచ్చి వెళ్లిన సమాచారాన్ని వారికి మృతురాలు అందజేసింది. ఈ క్రమంలో అత్తామాములు ఇంటికి వచ్చే సమయానికే ఆత్మాభిమానాన్ని కలిగిన మృతురాలు తన ఇరువురు పిల్లలుమెహక్,(4) మెనురూల్(3) లను దగ్గరికి తీసుకొని తనలో లేని కసాయితనాన్ని ప్రదర్శించి వారిరువురిని కడతేర్చింది. అదే క్రమంలో ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకొని తనూ తను చాలించింది. ఇది ఇలా ఉండగా, కోడలు ఇచ్చిన సమాచారంతో ఇంటికి వచ్చిన అత్తమామలు కోడలు మనవరాళ్ళు విగత జీవులుగా పడి ఉండడాన్ని గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు. స్థానికుల సహకారంతో వీరిని హుటాహుటిన మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్పటికీ అప్పటికే ముగ్గురు మృతి చెందారని వైద్యులు గుర్తించారు. క్షణాల వ్యవధిలో హృదయ విదారకంగా జరిగిన ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలు ఎంతో మంచిదని తన కుటుంబం కోసం ఉన్నత సాంకేతిక విద్య చదివిన ఈమె వ్యవసాయ పనులకు కూడా వెళ్లేదని, కేవలం అవమానభారాన్ని భరించలేక మనస్థాపానికి గురై ఇలా చేసి ఉంటుందని గ్రామస్తులు పేర్కొనడం గమనార్హం. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై లక్ష్మీ భార్గవి పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.