ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించటమే లక్ష్యం:జిల్లా ఎస్పీ గారు. గౌరవ ఎలక్షన్ కమీషన్ వారి ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ (SIB) నుండి ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ శ్రీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గారు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ గారిని ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ASP (క్రైమ్)యస్.వి. శ్రీధర్ రావు, AR అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొని పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన జిల్లా ఎస్పీ గారికి పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు.
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామన్నారు. గతంలో ప్రకాశం జిల్లాలో ట్రైనీ ఐపీఎస్ గా పనిచేశారు.