హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా స్పీకర్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడగా.. తిరిగి సమావేశం అయింది. ఈ సందర్భంగా ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యేవరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసనలు తెలియజేశారు. అనంతరం సభ నుంచి బయటికి వెళ్లిపోయారు.
అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడిన జగదీష్ రెడ్డి.. ఈ సభ అందరిదని.. సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్ కూర్చున్నారని.. ఈ సభ స్పీకర్ సొంతం కాదని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జగదీష్ రెడ్డి వెంటనే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌ను దూషించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మాట్లాడిన ప్రతి పదాన్ని జగదీష్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Our Telangana Citizen Reporter.
Mr. Shivacharan Chippa.