ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా: తిరుపతికి చెందిన 65 ఏళ్ల మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్, వాట్సాప్ వీడియో కాల్స్ చేసి, ఢిల్లీ సీబీఐ అధికారులమని రూ 200 కోట్లు మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. బాధితరాలు పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్‌ను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తూ లావాదేవీలు జరుపుతున్నారని భయభ్రాంతులకు గురి చేసారు. వివిధ అకౌంట్లకు నగదు ట్రాన్స్ఫర్ చేస్తే వాటిని పరిశీలించి సదరు డబ్బులు మనీలాండరింగ్ కేసులో ఇన్వాల్వ్ కాకపోతే రిలీజ్ చేస్తామని మాయ మాటలు చెప్పారు. ఇలా నమ్మించి ఆమె వద్ద నుంచి రూ 2.5 కోట్లు నగదును వివిధ అకౌంట్లలో జమ చేసుకున్న కేటుగాళ్లు ఆ తర్వాత స్పందించకపోవడంతో సైబర్ నేరం జరిగినట్లు బాధిత మహిళ గుర్తించారు. ఈ మేరకు ఈ నెల 13న తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటికే ఈ కేసులో రాజమండ్రికి చెందిన పాలకొల్లు అరుణ్ వినయ్ కుమార్‌ని అరెస్ట్ చేసి రూ 24.5 లక్షల నగదు, ఒక XUV 700 కారు, రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్స్‌లు, 16 గ్రాములు బంగారంతో పాటు సాంకేతికంగా ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అతని అకౌంట్లలో ఉన్న బాధిత మహిళకు చెందిన రూ 26 లక్షల నగదు లావాదేవీలను ఫ్రీజ్ చేసారు.కేసు దర్యాప్తులో భాగంగా మరింత పురోగతి సాధించిన పోలీసులు బుధవారం ఆరుగుర్ని అరెస్ట్ చేసారు. మరో రూ 32.5 లక్షల నగదు, 141 గ్రాముల బంగారం, 8 సెల్ ఫోన్లు, 2 ల్యాప్‌టాప్, ఒక సిమ్ మొడ్యుల్స్, 8 రూటర్లు అకౌంట్లలో ఉన్న బాధితురాలి డబ్బు రూ 10 లక్షల నగదు ఫ్రీజ్ చేసారుఎలాగైనా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో సీబీఐ అధికారులుగా అవతారం ఎత్తి అడ్డంగా బుక్ అయ్యారు. మీడియేటర్ సహాయంతో కంబోడియాకు వెళ్ళి అక్కడ కస్టమర్ సపోర్ట్‌గా పని చేస్తూ, టెక్నాలజీ ఉపయోగించి సైబర్ క్రైమ్‌పై అవగాహన పెంచుకున్న విశాఖపట్నంకు చెందిన ముఠా సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.విశాఖపట్నంలో ఒక రూమ్‌ను అద్దెకు తీసుకుని సైబర్ నేరానికి ఉపయోగపడేలా ఏర్పాట్లు చేసుకుని ఈ తతంగం నడిపించారు. సిమ్ మోడ్యూల్, రూటర్స్, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని అక్కడి నుంచి సైబర్ నేరాలకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇప్పటిదాకా ఈ కేసులో ఈ నెల 21న ఒకర్ని, బుధవారం మరో 6 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు రూ.57 లక్షల నగదు, రూ 38 లక్షల విలువ చేసే బంగారం ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాల్లో ఉన్న బాధిత మహిళకు చెందిన రూ 36 లక్షల నగదును కూడా ఫ్రీజ్ చేసారు. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టుల కేసుల సంఖ్య పెరుగుతూ ఉందన్నారు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. తెలియని నెంబర్ల నుంచి వాట్సప్ వీడియో కాల్స్ వస్తే స్పందించవద్దన్నారు ఎస్పీ. సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 లేదంటే 112, తిరుపతి పోలీసు వాట్సాప్ నెంబర్ 80999 99977కు ఫోన్ చేసి సాయం పొందాలన్నారు.
Our Telangana Citizen Reporter.
Mr. A Naveen Kumar.